Tuesday, June 17, 2008

చిలకమర్తి లక్ష్మీనరసింహం ( 1867 - 1946 ) వర్ధంతి 17 జూన్

చిలకమర్తి లక్ష్మీనరసింహం ( 1867 - 1946 ) వర్ధంతి 17 జూన్
చిలకమర్తివారి ప్రతిభాపర్వం
తన ప్రజ్ణాచక్షువులతో లోకాన్ని సందర్శించి పండిత పామరులకు అందుబాటులో ఉండే శైలిలో రచనలు సాగించి తెలుగు పఠితలోకానికి వినోదాన్నీ ప్రసాదించిన మహనీయుడు. ఆయన చారిత్రక, సాంఘిక పౌరాణిక నవలలు, జీవిత చరిత్రలు, స్వతంత్ర, అనువాద నాటకాలు, స్వీయచరిత్ర, ఆశుపద్యాలు, తెలుగువాళ్ళకు ఆవశ్యపఠనీయాలయ్యాయి. సంఘసంస్కరణోద్యమంలో కందుకూరివారికి బాసటగా నిలిచిన ప్రజాసేవాపరాయణుడు. వీరి పేరు వినగానే, వెంటనే స్ఫురించేవి - నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు, వంటి పద్యోక్తులు, సామెతలు సంపాదించుకున్న ప్రాచుర్యాన్ని అందుకో జాలినవి. ఆయన భాషలోని సారళ్యం గురించి అనుభూతి చెందవలసినదే కాని వర్ణించలేము. ఆ మహానుభావుని రచనలు చదువనివాడు, అధునిక ఆంధ్ర సాహిత్యోద్యానవనంలో ఒక విరబూచిన అరుదైన ప్రసూనవల్లరిని చూడలేనివాడై, ఆఘ్రాణించని వాడుగా చరిత్రలో చిరస్థాయిగా స్థాపితమవుతాడు. ఆయన పేరు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు.
జీవన్విద్యోద్యోగపర్వాలు
పశ్చిమగోదావరిజిల్లా, పెరవలి మండలంలోని ఖండవిల్లి గ్రామంలో వెంకన్న, రత్నమ్మ పుణ్యదంపతులకు 1867 జూన్ 17 న జన్మించిన చిలకమర్తివారు ఒక బ్రాహ్మణకుటుంబంలో జన్మిచారు. వీరవాసరం, నరసాపురంలో ప్రాధమికవిద్య, రాజమండ్రి హైస్కూలులో పట్టంచేబూనడం, 1889లో ఆర్యపాఠశాలలో ఉపాధ్యాయపదవి, యిన్నీసుపేట, మున్సిపల్ స్కూళ్ళలో విద్యాబోధన సాగించారు. తర్వాత సరస్వతి పత్రికాసంపాదకునిగా చేసి, ఉద్యోగానికి స్వస్తిచెప్పి, ఆపైన హిందూ సెకండరీ పాఠశాలను స్థాపించి, తొమ్మిదేళ్ళు నడిపిన తదుపరి, ఈ సంస్థని వీరేశలింగం హైస్కూలుగా మార్చబడింది. దురదౄష్టవశాత్తు 30 ఏళ్ళకే రేచీకటి వ్యాధికి గురైనాకూడా, ఆ అవరోధాన్ని త్రోసిరాజని, తన రచనలను కొనసాగించడంలో చిలకమర్తిగారికున్న పట్టుదలను, ప్రతిభను కొనియాడక తప్పదు.
వైవిధ్యభరిత ప్రతిభారంగాలు
నరసింహంగారు ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘసంస్కరణవాది, విద్యావేత్త. తెలుగుసాహిత్యాభివౄద్ధికీ, తెలుగుసీమలో ఆధునికభావవికాసానికీ, సేవలనందించిన ప్రముఖుల్లో చిలకమర్తివారు ప్రధమగణంలోకి వస్తారు. కేవలం యిరవైరెండేళ్ళ ప్రాయంలోనే రచించిన గయోపాఖ్యానం నాటకం తెలుగుసాహిత్యంలో కనీ వినీ ఎరుగని విషయం. అంతేకాక, ఈ నాటకంలో, టంగుటూరి ప్రకాశం పంతులుగారు, అర్జునుడి వేషం వేయడం అంతకన్న ప్రాధాన్యత సంతరించుకుంది. 1908లో ముద్రణాలయాన్ని స్థాపించడం, 1916లో గణపతి, రాజరత్నం వంటివి ప్రచురించారు. పాఠశాలలోనున్నప్పుడే పద్యరచనలను ప్రారంభించడం, వరుసగా అనేక రచనలను వ్రాయడం జరిగింది. మొదటి నాటకంగా వ్రాసిన కీచకవధ, ద్రౌపదీపరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతాకళ్యాణం, పారిజాతాపహరణం లాంటి నాటికలను, రామచంద్రవిజయం, హేమలత, అహల్యాభాయి, సుధాశరశ్చంద్రం లాంటి ముఖ్య నవలలను రచించారు. సరస్వతి పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, సౌందర్యతిలకం, పార్వతీపరిణయం రచించారు. యివికాక ఎన్నో రచనలను వ్రాశారు. చిలకమర్తివారి రచనలను మొత్తంగా ప్రచురణకావడం, 1943లో ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు కళాప్రపూర్ణ సత్కారంతో సన్మానించడం జరిగింది.
సాహిత్యంతోపాటు, సంస్కరణాభిలాష
ఉపాధ్యాయకత్వం, పత్రికాసంపాదకత్వం, రచనావ్యాసాంగాలతోపాటు, చిలకమర్తివారిలో నిస్కళ్మష మనోప్రవౄత్తితో నడిపించిన పధంగా సంఘసంస్కరణ కార్యక్రమం చెప్పుకోదగ్గ అంకం. మొదటితరం సంస్కరణవేత్తగా 1909లో సంఘంలో వెనుకబడిన వర్గప్రజలకోసం పాఠశాలను స్థాపించడమే కాక, పుష్కరపైకాలం నడపడంతోపాటు, బ్రహ్మసమాజం, హితకారిణీసమాజం వంటి సంస్కరణాధ్యేయంగల సంస్థలతో పాలుపంచుకున్న కార్యక్రమాలు, దేశమాత అనే వారపత్రికద్వారా తెల్లవారి పరిపాలనకు వ్యతిరేకంగా వ్యాసాంగం కావించడం కూడ జరిపారు. యితర ప్రత్యేక వ్యవహారాలు
మొదటినాటకం కీచకవధను 1889 జూన్ 15న ప్రదర్శించి మెప్పుపొందడం జరిగింది. కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిట్ శివానందశాస్త్రి, చిలకమర్తివారిని స్థానిక షేక్స్ పియర్ అని ప్రశంసించేవారు. అనేకమార్లు ప్రదర్శించబడిన గయోపాఖ్యానం నాటకం వసూళ్ళుగా లక్షకుపైగా టిక్కట్లు అమ్ముడుపోవడం, యిప్పటివరకూ కూడ రికార్డు అనే చెబుతారు. 1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం సామాజిక నవలకు న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతిని గెలవడం కూడ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. చిలకమర్తివారు స్వల్పకాలం అవధానప్రక్రియలో కూడ తన ప్రతిభను ప్రదర్శించారు. చిలకమర్తివారు సంకల్పించిన హరిజనోద్ధరణ కార్యక్రమం, మహాత్మాగాంధి దక్షిణాఫ్రికానుంచి భారతదేశం చేరుకోకముందే, ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించడం చాలా గొప్పవిషయం అనే చెప్పాలి. నరశింహంగారి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం, అద్భుతం అని పలువులు విశ్లేషించారు. మంచి వక్తగా శ్రోతలను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం బాగా పరిపాటి. యివి చాలక, చిలకమర్తివారు భారత జాతీయ కాంగ్రేసు కార్యకలాపాల్లో చురుగ్గా పోల్గొనేవారు.
చిలకమర్తివారి సాహిత్య ప్రతిభోదాహరణాలు
భరతఖండం చక్కని పాడియావు
చిలకమర్తివారి పేరు వెంటనే, అనేక నోళ్ళళ్ళో నానిన పద్యం - భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడవై ఏడుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి - అన్న పద్యం చరివినదే చదవడం, ఎందరో కంఠోపాఠం చేయడం, కౄష్ణానదీ వంతెన గోడలమీద పెన్సిళ్ళతో చెక్కబడడం, ఆనాటి గోదావరి సాహితీసభాపర్వాల్లోని పద్యాలతోబాటు హరికధల్లోకికూడ చేరిపోయింది. 1905లో బెంగాలు విభజన సందర్భంగా, బ్రహ్మమత ప్రచారకుడైన బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో చేసిన ఆంగ్లోపన్యాసాలకు చిలకమర్తివారి ఆంధ్రానువాదాలకు ముగింపు పద్యంగా - ఈగ వ్రాలినగాని వేగ జారెడునట్లు - అన్న పద్యం, ప్రత్యేకంగా, చెవుల సందున గిరజాలు చిందులాడ, మొగము మీదను జిరునవ్వు మొలకలెత్తి, టంగుటూరి ప్రకాశము రంగు మెరియు, ధవళగిరితీర్ధమునకు తరలివచ్చె - అన్న వాక్యాలు, చిలకమర్తి, టంగుటూరి ప్రకాశం, తిరునాళ్ళకు ధవళేశ్వరం వెళ్ళినప్పుడు చెప్పిన పద్యం శాశ్వతంగా సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నట్టి ఘనత ఆయనదే. చిలకమర్తివారి పకోడీ పద్యాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కోడికి బదులు పకోడీ తినమని బ్రాహ్మణులకు బ్రహ్మ వరమిచ్చాడని, లక్ష్మణుడు మూర్చకు మారుతికి పకోడీ వుందని తెలియక సంజీవని కోసం పరిగెత్తాడని, చమత్కారంగా హాస్యంగా రచన చేశారు. కందం చెప్పినవాడే కవి అన్న వాడుకను సార్ధకం చేశారు. సాధారణంగా వాడుకలో చెప్పే, ఆసేతు హిమాచలం అన్న ప్రయోగాన్ని, తుహినాద్రి మొదలు సేతువుదాల అని పైనుంచి క్రిందికి వరస చెప్పటం చిలకమర్తిశైలి చమత్కారం అనే చెప్పాలి. దీపంకింద నీడ, గులాబికిముళ్ళు, చందమామకిమచ్చ, చల్లని వానకిపిడుగు లాంటి ఉపమానాలు మాత్రం దొరతనానికి తగునా అని ప్రశ్నించారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం మార్గాన - అధికార భూతాలు అడెగే లంచం, మునసబు కరణాల ముడుపులు, యజమానులకు పంటలో అర్ధభాగం, పైకమిచ్చినవానికి వడ్డీలు, యిచ్చుకునే కాపుకి మిగిలిందేమిటి అని కూడ ప్రశ్నించారు. 1897 లో విక్టోరియారాణి వజ్రోత్సవం, అరవయ్యేళ్ళ పరిపాలన సందర్భంలో, రాజమండ్రిలో జరిగిన సభలో, చిలకమర్తివారు అనేక సీసపద్యాలు సిద్దహస్తత్వంతో చదవడం, పైగా పాదాల చివర, జోలపాట, చిత్తజల్లు, కందపెరడు, విల్లిపిడుగు పదప్రయోగాలు అంతరార్ధాలు చక్కగా గోచరిస్తాయి. తనదేహము, తనగేహము, తన కాలము తన భవమ్ము తన విద్యజగజ్జనులకు వినియేగించిన ఘనుడిగా వీరేశలింగం మరణించినప్పుడు చెప్పిన పద్యం కడు సార్ధకమైంది. పోతనగారు చెప్పిన పద్యం, మన సారధి మన సరిచుఘు మన నెయ్యము అన్నరీతిలో, చిలకమర్తివారిస్నేహం కందుకూరివారిపట్ల వున్న భవం వ్యక్తమవుతోంది. చిలకమర్తివారి గీతమంజరి పద్యాలు వేమనవిలా, పంచతంత్రకధల్లాగ, దీనకల్పద్రుమ అనే మకుటంతో 200 పై చిలుకు పద్యాలను మనోరమ పత్రికలో ప్రచురించడం, భక్తిరసప్రధానమైన రచనగా ఎదపలికినపుడు మ్రోగే భక్తిపరంపరగా పేర్కొనబడ్డాయి. రాతిబొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురాలు కుంభములను, కూడు గుడ్డ తానుకోరునా దేవుడు అని వేమనకు సరిపోలిక అయింది. పద్యరచనా చమత్కారంతోనే నాటకరంగాన్ని వశపరచుకోవడం, ఆశుకవితలు, శతకపద్యాలు, నాటకపద్యాలు ఏవైనా, చిలకమర్తివారి చేతపడి, నోటపడి, ధన్యమైనాయన్నదాంట్లో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. చిలకమర్తివారిని కవిగా పరిచయం చేసింది, వారు వివిధ సభల్లో చదివిన పద్యాలనే చెబుతారు. వేదం వెంకటరాయ శాస్త్రిగారి సన్మానసభలో చిలకమర్తివారు పద్యాలు చదవడం, మెచ్చుకోవడం, తర్వాత ఆశుపద్యాలు, నాటకకర్తగా, నవలారచయితగా, ప్రహసనకర్తగా, ప్రసిద్ధికెక్కిన చిలకమర్తివరి కవితావైభవం తెలుగు సాహిత్యంలో సముచితస్థానాన్ని సగౌరవంగా సంపాదించడం ఆయన ప్రతిభకు సహజతార్కాణాలు.
చిలకమర్తివారి స్వీయచరిత్ర
చిలకమర్తివారి స్వీయచరిత్ర వీరేశలింగంవారి చరిత్రకు అనుబంధం వుందనిపిస్తుందంటారు. తిలక్ నిర్యాణం నుంచి స్వాతంత్రోదయం వరకు సామాజిక పరివర్తనను చిలకమర్తి వారి స్వీయచరిత్ర ప్రతిబింబించింది. ఆనాటి సాహిత్యం, సంస్కౄతి, నాటకసమాజాలు, పాఠశాలలు, పత్రికలు, సంఘసంస్కరణ కార్యక్రమాలు, విస్తారంగా వివరించబడ్డాయి. దళితజాతులవారికి రాత్రి పాఠశాలలు, నిమ్యజాత్యుద్ధరణకోసం రామమోహనరాయల పేరున పాఠశాల నిర్వహణ, గయోపాఖ్యానం, చింతామణి నవలల పోటీలో వరసగా బహుమతులు గెల్చుకోవడం, 1893లో గోదావరిజిల్లాలో ప్రవేశించిన మొదటి రైలుబండి, 1895 లో గోదావరి మహాసభల్లో చదివిన పద్యాలు, ఆబాలగోపాలానికి రసనాగ్రాలపై నర్తించేవి.
భరతవాక్యం చిలకమర్తివారి పద్యంలోనే !!!
రాజభక్తి, దేశాభిమానం, జాలి, విధి, అంటూ పద్యాలను చెప్పి పాఠకుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం, ఆనాటి సభాసదుల్ని మంత్రముగ్ధుల్ని చేసినట్లు కదలకుండా చేయడం చిలకమర్తివారి పద్యరచనా రహస్యాలలో ముఖ్యమైనవి. అయితే, చివర్లో, నాటక లక్షణశాస్త్ర ఫక్కీలో, 'చిలకమర్తివారు, గౌతమా మండల సభకు ఖ్యాతి మెరయ, పూర్ణ భక్తి సమర్పించె పుష్పమాల, వసుధ వీరవాసరపుర వాసియైన, చిలకమర్తి లక్ష్మీనరసింహమూర్తీ అనే నాటకభరతవాక్యం లాంటి పద్యపుష్పమాలను సమర్పించి గోదావరీమండంలంలో ప్రముఖస్థానాన్ని, ప్రఖ్యాతతను పొందారు. ఈ భరతవాక్యంతోనే ఈ వ్యాసం పరిసమాప్తిచేయడం ఔచిత్యం, సమంజసం.
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి వర్ధంతి సందర్భంగా - తెలుగురధం, శతసహస్ర ప్రణామాల్ని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

No comments: