Tuesday, June 17, 2008

ఫిడేల్ వాదన కళకు సార్ధక నిర్దేశకులు - ద్వారం నాయుడు గారు

ఫిడేల్ వాదనకళకు సార్ధక నిర్దేశకుడు - 'ద్వారం నాయుడు (1893 - 1964)
వాయులీనం లో విలీనమైన 'ద్వారం'
ఫిడేల్, వైలెన్, వాయులీనం. ఈ పదాలు సాధారణంగా అర్ధంకానివి. పదాలు వేరైనా, వాటి అర్ధం, పరమార్ధం, ఒక్కటే. లలితకళల్లో, అజరామరమైన భాగంగా విరాజిల్లే సంగీతం. అందులోనూ వాద్యసంగీత విభాగం. వాయులీనం. దానినే, ఫిడేల్, వైలెన్ అని పిలవడం పరిపాటి. సంగీత కళకు, కళాకారులకు మధ్య వారధిలా చెలామణి అవుతున్న పరికరం. ఎందరో కళాకారుల చేతుల్లో ఒదిగిపోయి, వినయంగా తన్నుతానే సమర్పించుకున్న సంగీత పరికరం. అటువంటి కళాకారుల్లో, ప్రముఖులు, ప్రప్రధములు - 'ఫిడేళ్ నాయుడుగారు. ఆయనే 'ద్వారం' నాయుడుగారు. ఆయన, ఎవరో, వేరెవరో కాదు - ద్వారం వెంకటస్వామి నాయుడు గారు.
'ద్వారం' ప్రపంచానికే ముద్దుపేరు
సంగీత కళాజగతి కి ముద్దు పేరు 'ద్వారం'. సంగీత కచేరీ వేదిక పైన ప్రక్కనే స్థానం, సహవాద్యకారులుగా చెలామణి అవుతున్న దశనుంచి దిశానిర్దేశం కావించి, పరిపూర్ణ వాయులీన (వైలన్ లేక ఫిడేల్) సంగీత వాద్య పరికరానికి, మూగవోయిన పనిముట్టుని 'మెలోడీ ఫీస్ట్' గా మార్చడానికి కంకణం కట్టుకుని, కౄషిని సాధించిన ఘనత కేవలం ద్వారం నాయుడి గారి కళాజీవన ప్రస్థానం లో మరువలేని, మరింక మార్చలేని మైలురాళ్ళు. 20వ శ. చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ప్రధమగణంలో వినుతికెక్కిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు 8 నవంబర్ 1893 న బెంగుళూరులో దీపావళి రోజున కళ్ళు తెరవడంతో సంగీతజగతిలో మరింతగా కాంతి, వెలుగు చోటుచేసుకున్నాయి. తండ్రి వెంకటరాయుడు, ఆర్మీ లో కమీషన్ అధికారిగా ఉద్యోగం చేయడం, ఆయన ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నంకు వలసవెళ్ళారు. అనకాపల్లి దగ్గరలోని కాసింకోట వద్ద స్థిరపడ్డారు. అన్న వద్ద వైలన్ విద్యను అభ్యసించిన ద్వారం తండ్రికి కూడ ఈ వైలన్ విద్యలో అభినివేశం వుండడం విశేషం. తాత పేరును సార్ధక నామధేయం చేసుకున్న వెంకటస్వామి నాయుడు గారు, తన అన్నగారు వెంకటకౄష్ణయ్య, తాత దగ్గర వైలన్ నేర్చుకుంటున్న సమయంలో, మన నాయుడుగారు కూడ అన్నగారి వైలన్ ను కోరిక మేరకు రహస్యంగా కదిలించేవారట. ఫలితంగా, ఆరేళ్ళకే తమ్ముడిని వైలన్ విద్యలో పెట్టవలసివచ్చింది. దీనికి కారణాలు - తన వైలన్ ను ఏం చేస్తాడో అని అన్నకు భయం, నాయుడుగారికి కలుగుతున్న అమితమైన శ్రద్ధాసక్తులు. అంతేకాక, ముఖ్యంగా, నాయుడుగారికి చిన్నప్పుడు చూపులో కొంచెం సమస్య వున్న కారణంగా చదవడం, వ్రాయడం సమస్యగా మారుతున్న వైనంలో, సంగీతం పై దౄష్టి మరల్చవలసి వచ్చింది. ప్రాధమిక శిక్షణ తర్వాత, ప్రముఖులు పండిత సంగమేశ్వరశాస్త్రిగారి వద్ద నాయుడుగారు వైలన్ వాదనంలో నిష్ణాతులు అవ్వడం జరిగింది. అందుకే నాయుడుగారు తరచుగా నల్లరంగు కళ్ళజోడు ధరించేవారు.
ఫిడేల్, వైలన్
నాయుడుగారు 14వ ఏటనుంచే వైలన్ తో తాదాత్మ్యం పొందడం, ప్రముఖ సంగీత విశ్లేషకుడు మారేపల్లి రామచంద్రరావు ద్వారం వైలన్ ప్రతిభను గమనించి, డైమండ్ ఉంగరాన్ని కానుకగా యివ్వడమే కాక, ద్వారం వారిని 'ఫిడేల్ నాయుడూ అని బిరుదుని యిచ్చేరట. వైలన్ నే ఫిడేల్ అని పిలుస్తారని చాలా మందికి తెలియని విషయం. ఫిడేల్ అంటే 'ఫిడులా' అని జర్మనీ దేశపు పదంనుంచి ఫిడేల్ అని రూపాంతరం చెంది నాయుడుగారి దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి, ఫిడేల్, ఆంధ్రదేశపు సంగీతజగతితో మమైకం అయింది.
వైలన్ పుట్టు పూర్వోత్తరాలు
సంగీత వాద్య పరికరమే కొత్తగా అనిపించే, వైలన్, 17శ. మధ్యకాలంలో వాయులీన పరికరాలకు ప్రాణంపోసే పాశ్చాత్యుల పుణ్యమా అని, కర్నాటక సంగీత సంప్రదాయంలో అన్యాపదేశంగా ప్రవేశించి, తిష్ఠ వేసుకుంది. మొదటిసారిగా, 'వడివేలూ అన్న విద్వాంసుడు, ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలని వైలన్ పై అందించగా, దీక్షితులవారి సోదరుడు బాలు (1786-1859) దక్షిణభారత సంగీత వినువీధుల్లోకి వైలన్ ను తీసుకొచ్చిన ఘనత మనకు అలవడిన సంప్రదాయం. తర్వాత, 19శ. ఆఖరి పాదంలో, కర్నాటక సంగీతధోరణుల్లో, వైలన్ తో సంపూర్ణ ఏకైక వ్యక్తితో కచేరీ చేయడం ప్రారంభం అవడం, దీనికి తిరుకొడికవల్ కౄష్ణ అయ్యర్, గోవిందస్వామి పిళ్ళైలు రంగ్రప్రవేశం చేశారని సంగీత చరిత్ర చెబుతున్న కధనాలు.
వీణ, వేణువు, నాదస్వరం తో వైలన్ ను చేర్చిన ఘనత
వాద్యసంగీతజగతిలో అంతవరకూ నిత్యనూతనంగా అలరించిన, వీణ, వేణువు, నాదస్వరం ల ఘనమైన వరసలో వైలన్ ను నిలబెట్టిన ఘనత మాత్రం మన 'ఫిడేళ్ ద్వారం నాయుడుగారే అన్నది మాత్రం సత్యం. వీటికి వైలన్, వాయులీన ప్రక్రియ ఏమాత్రం తీసిపోదని కూడ నిరూపించిన నిష్ణాతవిద్వాంసుడు - ద్వారం నాయుడు.
ద్వారం గురించి ప్రముఖుల కౄషి, ప్రశంసలు
నాయుడుగారి ప్రతిభను చిత్రించిన రవివర్మ
పాశ్ఛాత్య, భారతీయ సంగీత మెలకువలను ఆకళింపుచేసుకున్న నాయుడుగారి వైలన్ పరికరాన్ని కచేరీలో నియంత్రించే విధివిధానాలు, నాయుడుగారి భంగిమ, చేతివేళ్ళతో తంత్రిణీస్వరలక్షణాలన్నింటినీ, ప్రముఖ చిత్రకారుడు రవివర్మ తనదైన ప్రత్యేకమైన శైలిలో నాయుడుగారి కచేరీ చేసున్నట్లు చిత్రం విశ్వవ్యాప్తంగా ఆశ్చర్యానందభూతుల్ని చేసింది. రవివర్మ చిత్రంలో నాయుడుగారి మనోధర్మ సంగీత లక్ష్యలక్షణాల్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు అన్నది మహామహుల అభిప్రాయంగా నేటికీ వినవస్తుంది.
ప్రముఖ సంగీతవిద్వాంసుల మెచ్చుకోళ్ళు
ద్వారం నాయుడుగారి కళాప్రతిభను కొనియాడుతూ, వివిధరంగాల్లోని ప్రముఖులు ప్రశంసలను చెప్పడం కూడ జరిగింది. అందులో, ప్రముఖ సంగీతవిద్వాంసులు - టి.యల్. వెంకట్రామ అయ్యర్, టి.వి.సుబ్బారావు, పి.సాంబమూర్తి, అరియకూడి రామానుజ అయ్యర్ (సంగీత కచేరీ సంప్రదాయానికి విధులు నిర్ణయించినవారు), తిరుకొడికవల్, ఆఖరున చెప్పుతున్నా, మొదటగా ప్రస్తావించదగిన ప్రముఖ సంగీత కళాకారుడు - శ్రీ సెమ్మనగుడి శ్రీనివాస అయ్యర్ గారు లాంటి ప్రభౄతులు ద్వారంవారి ప్రతిభను వేనోళ్ళ కొనియాడడం ఆ రోజుల్లో సర్వసామాన్యం.
ప్రముఖ కవులనుంచి అనుభూతులు
సంగీత విద్వాంసులతోపాటు, ప్రముఖ ఆంధ్రులు, కవులు కూడ తమ కవిత్వంలో ద్వారం వారిని మరవలేదు. వారిలో, చెళ్ళపిళ్ళ, విశ్వనాధ, బాలాంత్రపు రజనీకాంతరావు, గుర్రం ఝాషువా, గుంటూరు శేషేంద్రశర్మలను మరువలేం. సమాజంలోని అన్నివర్గాల ప్రతినిధులనుంచి ద్వారం నాయుడు గారు పొగడ్తలను అందుకున్నారు.
ప్రపంచ వైలన్ విద్వాంసుడు 'యెహుది మెనుహిణ్కి శౄంగభంగం
ప్రతిభ వున్న చోట అధికారంతోపాటు అహంకారం కూడ అధికమైన కళాకారులను ఆవరిస్తాయి అంటారు. ప్రపంచ ప్రఖ్యాత వైలన్ విద్వాంసుడు, 'యెహుది మెనుహిణ్ ఒక సన్నివేశంలో తన వైలన్ పరికరాన్ని, ద్వారం వారికి చూపించడానికి కూడ అంగీకరించలేదట. కాని, నాయుడుగారి వైలన్ వాదన ప్రభంజనం గమనించాక, ఈ మహానుభావుడు ఆశ్చర్యపోవడమే కాక, చివరికి ఆయన ఘనపరికరాన్ని నాయుడుగారికిచ్చి, వాయించమని వినయప్రకటన చేశాడట. అంతాకాక, ద్వారంవారిని ఆహ్వానించాడట. అదండీ, మన తెలుగు వెలుగు, తెలుగు తేజం తెలుగుదనం!
గురుదేవ్ రవీంద్రుడు కలిపిన స్వరగళం
ద్వారం నాయుడుగారి వైలన్ వాద్య కచేరీని కొద్ది నిముషాలే చూడగలగను అన్న గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్, అన్ని ముఖ్యకార్యక్రమాలను అనుకున్నవి మరచిపోయి, పూర్తి కచేరి వినడమే కాక, నాయుడుగారి కీర్తనలకు రవీంద్రుడు స్వరం, గళం కలిపి గానం చేయడం సంగీతచరిత్రలో ప్రముఖ సంఘటనగా నిలచిపోయింది.
నిలయవిద్వాంసుల కార్యక్రమాల్లో నాయుడుగారి వైలన్ వాద్యమే ఎప్పుడూ!
ఆ రోజుల్లో ఆకాశవాణి కార్యక్రమాల్లో, ద్వారం నాయుడుగారి వైలన్ కచేరీలు కోకొల్లలుగా వచ్చేవి; అంతేకాక, ప్రకటించిన కార్యక్రమాలకు అంతరాయం వచ్చిన సందర్భాల్లో, నాయుడుగారి కచేరీయే తరచుగా ప్రసారం చేసేవారట. అలాగే, కాకినాడ సరస్వతీసంగీతసభ కార్యక్రమానికి, అనుకున్నట్లుగా, గురువౄద్ధుడు, గోవిందస్వామి పిళ్ళై రాలేని పరిస్థితిలో, యువకుడు ద్వారం వారి వైలన్ కచేరీ పెట్టాలని సలహా యిచ్చారట. వయోభేదం అడ్డురాదన్న మాటకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సంగీతకళాశాలకు వన్నెలు
ప్రముఖ హరిదాస పితామహులు ఆదిభట్ల నారాయణదాసుగారు విజయనగరం సంగీత కళాశాల మహామహోపాధ్యాయులుగా వున్నప్పుడు, ద్వారం వారిని కేవలం 25 ఏళ్ళకే (1919 లో), విద్యార్ధిగా పరీక్షకు వచ్చినప్పుడు చూపించిన ప్రతిభ నేరుగా వైలన్ శిక్షణ విభాగానికి అధిపతిగా నియామకానికి దారితీసింది. అంతేకాక, ఆదిభట్ల వారి తర్వాత, ద్వారం వారే విజయనగరం కళాశాల స్థానాన్ని 1936 లో ఆక్రమించారు అన్నది ద్వారం వారి ఘనప్రతిభ వెల్లడయింది.
ప్రతిభాపురస్కారాలతో ద్వారం విశిష్ట ప్రక్రియలు
ద్వారం వారిని వరించిన బిరుదులు, పురస్కారాలు, సన్మానాలు, అగణితాలు.
1938 లో వైలన్ సోలో ప్రదర్శన, తమిళనాడులోని వెల్లూలు లో యిచ్చారు.1952 లో అంధుల సహాయసంస్థకు నిధులను చేకూర్చేందుకు, డిల్లీలోని జాతీయ శాస్త్రీయ సంస్థ లో ప్రదర్శన యిచ్చారు.
న్యాయవాది పి.వి.రాజమన్నార్ యింట్లో ప్రముఖ అంతర్జాతీయ వైలన్ విద్వాంసుడు యేహుది మెనుహిన్ ఆశ్చర్యం మేరకు ద్వారం వారి కచేరీ జరిగింది.కర్నాటక సంగీత కచేరీ కార్యక్రమాల్లో వైలన్ ను వాడవచ్చు అన్న భావకుల్లో ద్వారం ప్రధములు అని చెప్పుకోగలిగిన ఘనత.సంగీతకళ పై ద్వారం ఎన్నో వ్యాసాలు - 'తంబూర వింతలు, విశేషాలూ అన్నది మచ్చుతునక.
సంగీత కళానిధి (1941 - మద్రాసు మ్యూజిక్ అకాడమీ); కళాప్రపూర్ణ (1950 - ఆంధ్రవిశ్వవిద్యాలయం);సంగీత నాటక అకాడమీ, లలితకళలు (1953); పద్మశ్రీ (1957 - భారతప్రభుత్వం); ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన సంగీత కళాకారుడుగా నియామకం (ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ, ఉపాధ్యక్షులు).రాజలక్ష్మీ పురస్కారం (1992 - నాయుడు స్మారక సంస్థ, చెన్నై);శతజయంతి 1993 - భారతప్రభుత్వంవారి స్మారకచిహ్నంగా నాయుడుగారి తపాలాబిళ్ళ.
ద్వారం సలహాలు
విద్యార్ధులకు, వర్ధమాన కళాకారులకు, కనీసం ఒక్కరోజైనా సరే సాధన తప్పకూడదు అని సలహా చెప్పారు. ఒక్కరోజు తప్పితే - ఎవరి తప్పులు వారికే తెలుస్తాయి, రెండురోజులు అయితే - ప్రేక్షకులు, రసికులు కూడ తెలుసుకునే తప్పులు అని విభజించారు. నాయుడుగారు సంగీతం ఒక 'శ్రవణ తపస్సూ అని వర్ణించారు.
ద్వారం నాయుడు గారి స్మారక సంస్థలు
చెన్నైలో స్మారకసంస్థ, విశాఖపట్నంలో స్మారక కళాక్షేత్రం తో పాటు, విశాఖపట్నం, చెన్నైలో నాయుడుగారి విగ్రహాలు ఆయన ప్రతిభకు తార్కాణాలు, నిదర్శనాలు.
'ద్వారం' వారిపై ప్రముఖుల అభిప్రాయాలు
దేశాన్ని వైలన్ వాద్యంలో ముంచెత్తి, సంగీత నాదాన్ని అందంతో, ఆనందంతో అందజేసిన మహావిద్వాంసుడు; సంస్కౄతీ పునరుద్ధరణ సమయంలో 'ద్వారం' లేని సంగీత ప్రపంచాన్ని ఆలోచించడం కష్టతరం. (కళాక్షేత్ర, వ్యవస్థాపకురాలు, ప్రముఖ నాట్యకళాకారిణి - రుక్మిణీదేవి అరండలే)
ఆకాశవాణి లో ద్వారం కచేరి విని ప్రభావితమైన సంఘటన - నా జీవితంలో ఒక అమోఘమైన మైలురాయి. (నూకల సత్యనారాయణ, ప్రముఖ సంగీత విద్వాంసులు)
వైలన్ విద్వాంసుడిగానే 'నూకలా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రముఖ గాత్ర సంగీత ప్రతిభావిద్వాంసులుగా నిలిచారన్నది జగద్వితిమే.
కర్ణాటక సంగీత సంప్రదాయ ధోరణి లో ఆచరించే ఒక 'ప్రోటకాళ్(సదాచారం) ప్రకారం, సహవాద్య సంగీత కళాకారుడే, గాత్ర సంగీత కళాకారుడి వద్దకు వెళ్ళడం ఆనవాయితీ. అయితే, ద్వారం వారి వద్దకు సుప్రసిద్ధ గాత్ర సంగీత విద్వాంసులు తమంత తామే స్వయంగా వచ్చి పలకరించే విధానాన్ని బట్టి, ద్వారం వారి ప్రతిభ, గౌరవం, మర్యాద, వర్ణనాతీతమైనే చెప్పాలి; కళాకారుడికి సాధనాభ్యాసాలు నిత్యావసరం అన్న సూత్రాన్ని, మనసావాచాకర్మణా, నమ్మి, మనోధర్మ ప్రవౄత్తిని ఆచరించిన కళాకారుల్లో ప్రముఖులు ద్వారం నాయుడుగారు. ఒకసారి విజయవాడ కచేరీకి వచ్చి, 'మహిమ తెలియ తరమా' అన్న కౄతి పల్లవి సరిగ్గా కుదురుట లేదని, అభిప్రాయాలను అల్పస్థాయి కళాకారులను కూడ సంప్రదించడం జరిగేది. (ప్రముఖ సంగీత విశ్లేషకులు - టి.ఆర్.సుబ్రహ్మణ్యం).
నాయుడు గారి నిరాడంబరత
యింత పేరు ఎలా తెచ్చుకున్నారు అని ద్వారం వారిని అడిగితే, 'ఎట్లా వాయించాలో నాకు తెలియదు; ఏదో వాయించాను; బాగుందో, లేదో, నాకు తెలియదు" అని తరచు ద్వారంవారు సమాధానం చెప్పడం వారి నిరాడంబరతా వ్యక్తిత్వానికి, హౄదయవైశాల్యతకి, మానవతకి నిదర్శనం అని పలువురి భావన.
ద్వారం ప్రియరాగాలు
ద్వారం నాయుడు గారిని, వారి ప్రియసంగీత రాగాలు ఏమిటని అడిగితే, తరచుగా వచ్చే రాగాలు - కాపీ, బేహాగ్, నళినకాంతి రాగాల్లో సుదీర్ఘమైన 'కరవై'లతో ప్రదర్శించే రాగాలు అని చెప్పడం, భక్తులు దైవప్రార్ధనలో మునిగిపోయి పరిసరాలను మరపించి రాగదేవతను ప్రత్యక్ష దౄశ్యం కలిగించే అనుభవం తరచుగా అయేదిట. 'ఖమాశ్, 'నీలాంబరీ లాంటి రక్తి రాగాలను అందించడంలో అధ్బుత కౌశలత్వం, విశిష్ట సౌందర్య నాదాలుద్భవించేవట. ద్వారం వారు, విజయనగర సంగీత కళాశాల నిర్వాహకత్వంలో అధిక విద్యార్ధులు వైలన్ విభాగంలోనే, గాత్ర సంగీతభాగంలో కన్న, అభ్యసించేందుకు సంసిద్ధత ప్రదర్శించేవారని, అందరూ, ఎప్పూడూ, ఈనాటికీ, అనుకునే మాట.
ఆంధ్ర సంగీత జగతి చేసుకున్న పుణ్యం
సంగీతకళానిధి గా విశ్వవిఖ్యాతమైన ప్రతిభను తెచ్చుకున్న ద్వారం వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ సంగీతప్రియులు చాలా అదౄష్టవంతులని, దక్షిణ, అఖిల భారత సంగీత కార్యక్రమాల్లో ప్రాతినిథ్యం వహించిన వారిలో ద్వారం వారు ప్రధముల్లో ప్రధములు అని చెప్పాలి. కళాకారుడికి వుత్పన్నమయ్యే ప్రతిభాపాటవాలు విశిష్టమై, విశ్వవ్యాప్తమైతే, తోటి వర్ధమాన కళాకారుల ప్రశంసలు కూడ తప్పక లభిస్తాయి అన్నది ద్వారం వారి విషయంలో నిజం అయి కూర్చుంది. అదే వారికీ, వారి సహకళాకారులకీ సౌభాగ్యం.
విశ్వసంగీతజగతి ద్వారాలు తెరుచుకున్నప్పుడల్లా, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, వారితోపాటు, వారి మాంత్రిక వైలన్ వాదనవైభవం లేనిదే ద్వారాలు తెరచుకోవు అన్నదాంట్లో ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు.
ద్వారం వారి జయంతి, వర్ధంతి నవంబర్ నెలలోనే సాధారణంగా జరగడం యాదౄఛ్ఛికం. నవంబర్ 8 వారి జయంతి అయితే, నవంబర్ 25 న వారు మహాభినిష్క్రమణం చెందారు.
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: అన్న నానుడి, బహుశ ద్వారం వారి వాయులీనవాదన సౌరభం విన్న తర్వాత వచ్చినది కావచ్చు.
ద్వారం వారికి, వారి వాయులీన వాదన కళకు, కళానీరాజన ప్రణామాల్ని తెలుగు రధం వినమ్రంగా సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగు రధం.

చిలకమర్తి లక్ష్మీనరసింహం ( 1867 - 1946 ) వర్ధంతి 17 జూన్

చిలకమర్తి లక్ష్మీనరసింహం ( 1867 - 1946 ) వర్ధంతి 17 జూన్
చిలకమర్తివారి ప్రతిభాపర్వం
తన ప్రజ్ణాచక్షువులతో లోకాన్ని సందర్శించి పండిత పామరులకు అందుబాటులో ఉండే శైలిలో రచనలు సాగించి తెలుగు పఠితలోకానికి వినోదాన్నీ ప్రసాదించిన మహనీయుడు. ఆయన చారిత్రక, సాంఘిక పౌరాణిక నవలలు, జీవిత చరిత్రలు, స్వతంత్ర, అనువాద నాటకాలు, స్వీయచరిత్ర, ఆశుపద్యాలు, తెలుగువాళ్ళకు ఆవశ్యపఠనీయాలయ్యాయి. సంఘసంస్కరణోద్యమంలో కందుకూరివారికి బాసటగా నిలిచిన ప్రజాసేవాపరాయణుడు. వీరి పేరు వినగానే, వెంటనే స్ఫురించేవి - నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు, వంటి పద్యోక్తులు, సామెతలు సంపాదించుకున్న ప్రాచుర్యాన్ని అందుకో జాలినవి. ఆయన భాషలోని సారళ్యం గురించి అనుభూతి చెందవలసినదే కాని వర్ణించలేము. ఆ మహానుభావుని రచనలు చదువనివాడు, అధునిక ఆంధ్ర సాహిత్యోద్యానవనంలో ఒక విరబూచిన అరుదైన ప్రసూనవల్లరిని చూడలేనివాడై, ఆఘ్రాణించని వాడుగా చరిత్రలో చిరస్థాయిగా స్థాపితమవుతాడు. ఆయన పేరు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు.
జీవన్విద్యోద్యోగపర్వాలు
పశ్చిమగోదావరిజిల్లా, పెరవలి మండలంలోని ఖండవిల్లి గ్రామంలో వెంకన్న, రత్నమ్మ పుణ్యదంపతులకు 1867 జూన్ 17 న జన్మించిన చిలకమర్తివారు ఒక బ్రాహ్మణకుటుంబంలో జన్మిచారు. వీరవాసరం, నరసాపురంలో ప్రాధమికవిద్య, రాజమండ్రి హైస్కూలులో పట్టంచేబూనడం, 1889లో ఆర్యపాఠశాలలో ఉపాధ్యాయపదవి, యిన్నీసుపేట, మున్సిపల్ స్కూళ్ళలో విద్యాబోధన సాగించారు. తర్వాత సరస్వతి పత్రికాసంపాదకునిగా చేసి, ఉద్యోగానికి స్వస్తిచెప్పి, ఆపైన హిందూ సెకండరీ పాఠశాలను స్థాపించి, తొమ్మిదేళ్ళు నడిపిన తదుపరి, ఈ సంస్థని వీరేశలింగం హైస్కూలుగా మార్చబడింది. దురదౄష్టవశాత్తు 30 ఏళ్ళకే రేచీకటి వ్యాధికి గురైనాకూడా, ఆ అవరోధాన్ని త్రోసిరాజని, తన రచనలను కొనసాగించడంలో చిలకమర్తిగారికున్న పట్టుదలను, ప్రతిభను కొనియాడక తప్పదు.
వైవిధ్యభరిత ప్రతిభారంగాలు
నరసింహంగారు ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘసంస్కరణవాది, విద్యావేత్త. తెలుగుసాహిత్యాభివౄద్ధికీ, తెలుగుసీమలో ఆధునికభావవికాసానికీ, సేవలనందించిన ప్రముఖుల్లో చిలకమర్తివారు ప్రధమగణంలోకి వస్తారు. కేవలం యిరవైరెండేళ్ళ ప్రాయంలోనే రచించిన గయోపాఖ్యానం నాటకం తెలుగుసాహిత్యంలో కనీ వినీ ఎరుగని విషయం. అంతేకాక, ఈ నాటకంలో, టంగుటూరి ప్రకాశం పంతులుగారు, అర్జునుడి వేషం వేయడం అంతకన్న ప్రాధాన్యత సంతరించుకుంది. 1908లో ముద్రణాలయాన్ని స్థాపించడం, 1916లో గణపతి, రాజరత్నం వంటివి ప్రచురించారు. పాఠశాలలోనున్నప్పుడే పద్యరచనలను ప్రారంభించడం, వరుసగా అనేక రచనలను వ్రాయడం జరిగింది. మొదటి నాటకంగా వ్రాసిన కీచకవధ, ద్రౌపదీపరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతాకళ్యాణం, పారిజాతాపహరణం లాంటి నాటికలను, రామచంద్రవిజయం, హేమలత, అహల్యాభాయి, సుధాశరశ్చంద్రం లాంటి ముఖ్య నవలలను రచించారు. సరస్వతి పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, సౌందర్యతిలకం, పార్వతీపరిణయం రచించారు. యివికాక ఎన్నో రచనలను వ్రాశారు. చిలకమర్తివారి రచనలను మొత్తంగా ప్రచురణకావడం, 1943లో ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు కళాప్రపూర్ణ సత్కారంతో సన్మానించడం జరిగింది.
సాహిత్యంతోపాటు, సంస్కరణాభిలాష
ఉపాధ్యాయకత్వం, పత్రికాసంపాదకత్వం, రచనావ్యాసాంగాలతోపాటు, చిలకమర్తివారిలో నిస్కళ్మష మనోప్రవౄత్తితో నడిపించిన పధంగా సంఘసంస్కరణ కార్యక్రమం చెప్పుకోదగ్గ అంకం. మొదటితరం సంస్కరణవేత్తగా 1909లో సంఘంలో వెనుకబడిన వర్గప్రజలకోసం పాఠశాలను స్థాపించడమే కాక, పుష్కరపైకాలం నడపడంతోపాటు, బ్రహ్మసమాజం, హితకారిణీసమాజం వంటి సంస్కరణాధ్యేయంగల సంస్థలతో పాలుపంచుకున్న కార్యక్రమాలు, దేశమాత అనే వారపత్రికద్వారా తెల్లవారి పరిపాలనకు వ్యతిరేకంగా వ్యాసాంగం కావించడం కూడ జరిపారు. యితర ప్రత్యేక వ్యవహారాలు
మొదటినాటకం కీచకవధను 1889 జూన్ 15న ప్రదర్శించి మెప్పుపొందడం జరిగింది. కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిట్ శివానందశాస్త్రి, చిలకమర్తివారిని స్థానిక షేక్స్ పియర్ అని ప్రశంసించేవారు. అనేకమార్లు ప్రదర్శించబడిన గయోపాఖ్యానం నాటకం వసూళ్ళుగా లక్షకుపైగా టిక్కట్లు అమ్ముడుపోవడం, యిప్పటివరకూ కూడ రికార్డు అనే చెబుతారు. 1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం సామాజిక నవలకు న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతిని గెలవడం కూడ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. చిలకమర్తివారు స్వల్పకాలం అవధానప్రక్రియలో కూడ తన ప్రతిభను ప్రదర్శించారు. చిలకమర్తివారు సంకల్పించిన హరిజనోద్ధరణ కార్యక్రమం, మహాత్మాగాంధి దక్షిణాఫ్రికానుంచి భారతదేశం చేరుకోకముందే, ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించడం చాలా గొప్పవిషయం అనే చెప్పాలి. నరశింహంగారి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం, అద్భుతం అని పలువులు విశ్లేషించారు. మంచి వక్తగా శ్రోతలను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం బాగా పరిపాటి. యివి చాలక, చిలకమర్తివారు భారత జాతీయ కాంగ్రేసు కార్యకలాపాల్లో చురుగ్గా పోల్గొనేవారు.
చిలకమర్తివారి సాహిత్య ప్రతిభోదాహరణాలు
భరతఖండం చక్కని పాడియావు
చిలకమర్తివారి పేరు వెంటనే, అనేక నోళ్ళళ్ళో నానిన పద్యం - భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడవై ఏడుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి - అన్న పద్యం చరివినదే చదవడం, ఎందరో కంఠోపాఠం చేయడం, కౄష్ణానదీ వంతెన గోడలమీద పెన్సిళ్ళతో చెక్కబడడం, ఆనాటి గోదావరి సాహితీసభాపర్వాల్లోని పద్యాలతోబాటు హరికధల్లోకికూడ చేరిపోయింది. 1905లో బెంగాలు విభజన సందర్భంగా, బ్రహ్మమత ప్రచారకుడైన బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో చేసిన ఆంగ్లోపన్యాసాలకు చిలకమర్తివారి ఆంధ్రానువాదాలకు ముగింపు పద్యంగా - ఈగ వ్రాలినగాని వేగ జారెడునట్లు - అన్న పద్యం, ప్రత్యేకంగా, చెవుల సందున గిరజాలు చిందులాడ, మొగము మీదను జిరునవ్వు మొలకలెత్తి, టంగుటూరి ప్రకాశము రంగు మెరియు, ధవళగిరితీర్ధమునకు తరలివచ్చె - అన్న వాక్యాలు, చిలకమర్తి, టంగుటూరి ప్రకాశం, తిరునాళ్ళకు ధవళేశ్వరం వెళ్ళినప్పుడు చెప్పిన పద్యం శాశ్వతంగా సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నట్టి ఘనత ఆయనదే. చిలకమర్తివారి పకోడీ పద్యాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కోడికి బదులు పకోడీ తినమని బ్రాహ్మణులకు బ్రహ్మ వరమిచ్చాడని, లక్ష్మణుడు మూర్చకు మారుతికి పకోడీ వుందని తెలియక సంజీవని కోసం పరిగెత్తాడని, చమత్కారంగా హాస్యంగా రచన చేశారు. కందం చెప్పినవాడే కవి అన్న వాడుకను సార్ధకం చేశారు. సాధారణంగా వాడుకలో చెప్పే, ఆసేతు హిమాచలం అన్న ప్రయోగాన్ని, తుహినాద్రి మొదలు సేతువుదాల అని పైనుంచి క్రిందికి వరస చెప్పటం చిలకమర్తిశైలి చమత్కారం అనే చెప్పాలి. దీపంకింద నీడ, గులాబికిముళ్ళు, చందమామకిమచ్చ, చల్లని వానకిపిడుగు లాంటి ఉపమానాలు మాత్రం దొరతనానికి తగునా అని ప్రశ్నించారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం మార్గాన - అధికార భూతాలు అడెగే లంచం, మునసబు కరణాల ముడుపులు, యజమానులకు పంటలో అర్ధభాగం, పైకమిచ్చినవానికి వడ్డీలు, యిచ్చుకునే కాపుకి మిగిలిందేమిటి అని కూడ ప్రశ్నించారు. 1897 లో విక్టోరియారాణి వజ్రోత్సవం, అరవయ్యేళ్ళ పరిపాలన సందర్భంలో, రాజమండ్రిలో జరిగిన సభలో, చిలకమర్తివారు అనేక సీసపద్యాలు సిద్దహస్తత్వంతో చదవడం, పైగా పాదాల చివర, జోలపాట, చిత్తజల్లు, కందపెరడు, విల్లిపిడుగు పదప్రయోగాలు అంతరార్ధాలు చక్కగా గోచరిస్తాయి. తనదేహము, తనగేహము, తన కాలము తన భవమ్ము తన విద్యజగజ్జనులకు వినియేగించిన ఘనుడిగా వీరేశలింగం మరణించినప్పుడు చెప్పిన పద్యం కడు సార్ధకమైంది. పోతనగారు చెప్పిన పద్యం, మన సారధి మన సరిచుఘు మన నెయ్యము అన్నరీతిలో, చిలకమర్తివారిస్నేహం కందుకూరివారిపట్ల వున్న భవం వ్యక్తమవుతోంది. చిలకమర్తివారి గీతమంజరి పద్యాలు వేమనవిలా, పంచతంత్రకధల్లాగ, దీనకల్పద్రుమ అనే మకుటంతో 200 పై చిలుకు పద్యాలను మనోరమ పత్రికలో ప్రచురించడం, భక్తిరసప్రధానమైన రచనగా ఎదపలికినపుడు మ్రోగే భక్తిపరంపరగా పేర్కొనబడ్డాయి. రాతిబొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురాలు కుంభములను, కూడు గుడ్డ తానుకోరునా దేవుడు అని వేమనకు సరిపోలిక అయింది. పద్యరచనా చమత్కారంతోనే నాటకరంగాన్ని వశపరచుకోవడం, ఆశుకవితలు, శతకపద్యాలు, నాటకపద్యాలు ఏవైనా, చిలకమర్తివారి చేతపడి, నోటపడి, ధన్యమైనాయన్నదాంట్లో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. చిలకమర్తివారిని కవిగా పరిచయం చేసింది, వారు వివిధ సభల్లో చదివిన పద్యాలనే చెబుతారు. వేదం వెంకటరాయ శాస్త్రిగారి సన్మానసభలో చిలకమర్తివారు పద్యాలు చదవడం, మెచ్చుకోవడం, తర్వాత ఆశుపద్యాలు, నాటకకర్తగా, నవలారచయితగా, ప్రహసనకర్తగా, ప్రసిద్ధికెక్కిన చిలకమర్తివరి కవితావైభవం తెలుగు సాహిత్యంలో సముచితస్థానాన్ని సగౌరవంగా సంపాదించడం ఆయన ప్రతిభకు సహజతార్కాణాలు.
చిలకమర్తివారి స్వీయచరిత్ర
చిలకమర్తివారి స్వీయచరిత్ర వీరేశలింగంవారి చరిత్రకు అనుబంధం వుందనిపిస్తుందంటారు. తిలక్ నిర్యాణం నుంచి స్వాతంత్రోదయం వరకు సామాజిక పరివర్తనను చిలకమర్తి వారి స్వీయచరిత్ర ప్రతిబింబించింది. ఆనాటి సాహిత్యం, సంస్కౄతి, నాటకసమాజాలు, పాఠశాలలు, పత్రికలు, సంఘసంస్కరణ కార్యక్రమాలు, విస్తారంగా వివరించబడ్డాయి. దళితజాతులవారికి రాత్రి పాఠశాలలు, నిమ్యజాత్యుద్ధరణకోసం రామమోహనరాయల పేరున పాఠశాల నిర్వహణ, గయోపాఖ్యానం, చింతామణి నవలల పోటీలో వరసగా బహుమతులు గెల్చుకోవడం, 1893లో గోదావరిజిల్లాలో ప్రవేశించిన మొదటి రైలుబండి, 1895 లో గోదావరి మహాసభల్లో చదివిన పద్యాలు, ఆబాలగోపాలానికి రసనాగ్రాలపై నర్తించేవి.
భరతవాక్యం చిలకమర్తివారి పద్యంలోనే !!!
రాజభక్తి, దేశాభిమానం, జాలి, విధి, అంటూ పద్యాలను చెప్పి పాఠకుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం, ఆనాటి సభాసదుల్ని మంత్రముగ్ధుల్ని చేసినట్లు కదలకుండా చేయడం చిలకమర్తివారి పద్యరచనా రహస్యాలలో ముఖ్యమైనవి. అయితే, చివర్లో, నాటక లక్షణశాస్త్ర ఫక్కీలో, 'చిలకమర్తివారు, గౌతమా మండల సభకు ఖ్యాతి మెరయ, పూర్ణ భక్తి సమర్పించె పుష్పమాల, వసుధ వీరవాసరపుర వాసియైన, చిలకమర్తి లక్ష్మీనరసింహమూర్తీ అనే నాటకభరతవాక్యం లాంటి పద్యపుష్పమాలను సమర్పించి గోదావరీమండంలంలో ప్రముఖస్థానాన్ని, ప్రఖ్యాతతను పొందారు. ఈ భరతవాక్యంతోనే ఈ వ్యాసం పరిసమాప్తిచేయడం ఔచిత్యం, సమంజసం.
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి వర్ధంతి సందర్భంగా - తెలుగురధం, శతసహస్ర ప్రణామాల్ని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Monday, January 21, 2008

ఆముఖం

ఆముఖం - ముఖే ముఖే సరస్వతీ!



హృదయానికి ముఖం అద్దం లాంటిది. ముఖం చూసి గుణగుణాలు నిర్ణయిస్తారు మనవాళ్ళు. నీ మొహమంత చందమాముంటే, గుడ్డి దీపమొకటా? అంటాడు ప్రముఖ కవి బుచ్చిబాబు. ముఖం వ్యక్తిత్వానికి ప్రతీక, నిదర్శనం. ఆ వ్యక్తి ముఖంలో మనకు అతని ప్రతిభావ్యుత్పత్తులు దర్శనీయమవుతాయి. ఒక రకపైన, అనిర్వచనీయమైన స్ఫూర్తి, ప్రేరణలు కలుగుతాయి. ఆ మహానుభావుని నడకలో, నడతలో అనుసరించడానికి అవకాశాలు తరచు లభ్యం అవుతుంటాయి. అందుకే జీవితచరిత్రలు, ఆత్మచరిత్రలు రచించడం జరుగుతుంది. గతకాలపు వైభవ స్మృతులు ముందుతరాలవారు అనుసరించి, ఆచరించడానికి మూలదినుసులుగా ఉపకరిస్తాయి. అందుకే ముఖే ముఖే సరస్వతీ - ప్రతీ ముఖంలో సరస్వతి దర్శనం యిస్తుందిట. వస్ఛస్సు, తేజం, స్ఫూర్తి ఒకేసారి ద్విగుణీకృతమై ఆ మహామనిషి ఫాలభాగంలో చిత్రీకరించబడతాయి. అటువంటి మహానుభావులు, మహామనీశులు మన తెలుగు నేలపై ఎందరో. ఒక విధంగా చెప్పాలంటే, అందరూ మహానుభావులే. కొందరి మహానుభావుకత వెల్లడవుతుంది. కొందరిది అదృశ్యమయంగా స్థంభింస్తుంది. తెలుగురధం లోకి మహానుభావుల ముఖసరస్వతీ ప్రతిమలను సుప్రతిష్ఠ చేసే సత్ప్రయత్నం యిది. ఆ యా మహానుభావుల జీవిత, వ్యక్తిత్వ చిత్రణలను తెలుగురధం ప్రచురణలో అందజేస్తున్న సంగతి విదితం. వాటికి తోడుగా ఆ మహానుభావుల చిత్రాలను, ఆముఖాలను ప్రచురించే ప్రణాళికను తెలుగురధం అభిమానులు సదా ఆదరిస్తారనే విశ్వాసంతో, ముందుకు వేస్తున్న ఒక అడుగ్గు. ఆశీర్వదించండి. ఆదరించండి. శుభం భూయాత్. కొంపెల్ల శర్మ.