Monday, January 21, 2008

ఆముఖం

ఆముఖం - ముఖే ముఖే సరస్వతీ!



హృదయానికి ముఖం అద్దం లాంటిది. ముఖం చూసి గుణగుణాలు నిర్ణయిస్తారు మనవాళ్ళు. నీ మొహమంత చందమాముంటే, గుడ్డి దీపమొకటా? అంటాడు ప్రముఖ కవి బుచ్చిబాబు. ముఖం వ్యక్తిత్వానికి ప్రతీక, నిదర్శనం. ఆ వ్యక్తి ముఖంలో మనకు అతని ప్రతిభావ్యుత్పత్తులు దర్శనీయమవుతాయి. ఒక రకపైన, అనిర్వచనీయమైన స్ఫూర్తి, ప్రేరణలు కలుగుతాయి. ఆ మహానుభావుని నడకలో, నడతలో అనుసరించడానికి అవకాశాలు తరచు లభ్యం అవుతుంటాయి. అందుకే జీవితచరిత్రలు, ఆత్మచరిత్రలు రచించడం జరుగుతుంది. గతకాలపు వైభవ స్మృతులు ముందుతరాలవారు అనుసరించి, ఆచరించడానికి మూలదినుసులుగా ఉపకరిస్తాయి. అందుకే ముఖే ముఖే సరస్వతీ - ప్రతీ ముఖంలో సరస్వతి దర్శనం యిస్తుందిట. వస్ఛస్సు, తేజం, స్ఫూర్తి ఒకేసారి ద్విగుణీకృతమై ఆ మహామనిషి ఫాలభాగంలో చిత్రీకరించబడతాయి. అటువంటి మహానుభావులు, మహామనీశులు మన తెలుగు నేలపై ఎందరో. ఒక విధంగా చెప్పాలంటే, అందరూ మహానుభావులే. కొందరి మహానుభావుకత వెల్లడవుతుంది. కొందరిది అదృశ్యమయంగా స్థంభింస్తుంది. తెలుగురధం లోకి మహానుభావుల ముఖసరస్వతీ ప్రతిమలను సుప్రతిష్ఠ చేసే సత్ప్రయత్నం యిది. ఆ యా మహానుభావుల జీవిత, వ్యక్తిత్వ చిత్రణలను తెలుగురధం ప్రచురణలో అందజేస్తున్న సంగతి విదితం. వాటికి తోడుగా ఆ మహానుభావుల చిత్రాలను, ఆముఖాలను ప్రచురించే ప్రణాళికను తెలుగురధం అభిమానులు సదా ఆదరిస్తారనే విశ్వాసంతో, ముందుకు వేస్తున్న ఒక అడుగ్గు. ఆశీర్వదించండి. ఆదరించండి. శుభం భూయాత్. కొంపెల్ల శర్మ.

No comments: